The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 6
PoorBest 

ఆవు-పులి కధ తెలియని తెలుగువాడుండడంటే అతిశయోక్తి కానేకాదు.సత్యవాక్యపాలన ఎంత శక్తివంతమైనదో వర్ణించే ఆ కధ తెలుగు వారికి తెలిసి అనంతామాత్యుడు రచించిన భోజరాజీయమనే మహాకావ్యంలోనిది. తెలుగులో మొట్టమొదటి కల్పిత కధాకావ్యం ఇది. ఈ భోజరాజీయమంటే భోజరాజు కధలేమో అని చాలామంది అనుకుంటారుగానీ అది నిజం కాదు - భోజుడికి, సర్పటి అనే ఋషికి జరిగిన వాగ్వివాదమది. అనంతామాత్యుడిచే ముగ్ధమనోహరంగా తీర్చిదిద్దబడింది. 

ఈ ఆవు పులి కధను అనంతామాత్యుడు మలచిన తీరును (గోవ్యాఘ్ర సంవాదం - భోజరాజీయం) ప్రశంసిస్తూ అనేక రచనలు వెలువడ్డాయి - తెలుగు వికీపీడియాలో కూడా ఆ కధ అనంతామాత్యుడికే అన్వయించబడింది. అయితే అది అనంతామాత్యుడి కల్పితమా లేక దాని మూలం వేరే చోటా ఉందా అనే చర్చకు 40 యేండ్ల క్రితమే తెర లేచింది.

1970వ దశకం - విశాఖ జిల్లా - అనకాపల్లి పట్టణం - తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్న ఒకావిడకి ఎందుకో తెలుగులో మహత్తరమైన పరిశోధన చేసెయ్యాలనే బృహత్తరమైన అలోచన పుట్టింది. 'లేడీ' కి లేచిందే పరుగన్నట్టు వెంటనే ఆవిడ నాగార్జునా విశ్వవిద్యాలయంలో ఒక పేరుమోసిన ప్రొఫెసర్ గారిని సంప్రదించారు. ఆయన మొదట్లో "యూనివర్సిటీ కి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటూ భర్త, ఆరేడేళ్ళ కొడుకు, ఉద్యోగంతో క్షణం తీరికలేకుండా ఉన్నావిడ పరిశోధన ఏంచేస్తుందిలే?" అంటూ పెద్దగా పట్టించుకోకపోయినా, రానురానూ ఆవిడ పట్టుదల చూసి ప్రొత్సహించడం మొదలుపెట్టారు. పరిశోధనాంశం "భోజరాజీయం".

********

ఇద్దరూ కలిసి దానికి సంబంధించిన సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యడం మొదలుపెట్టారు.

రోజులిలా సాగుతుండగా కొన్నాళ్ళకి ఆవిడకి ఆరోగ్యం బాలేక నాలుగయిదు రోజులు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. సరేనని సాహిత్యం పక్కనపెట్టి అక్కడ ఉన్నవాళ్ళని ఏవైనా పత్రికలు తీసుకురమ్మని అడిగితే వాళ్ళూ కాస్తా ఏ సితారో, జ్యోతిచిత్రో తీసుకొచ్చిపడేశారు. అవి చదవడం కాస్త చిరాకయినా చేయగలిగిందేమిలేక మన సదరు పరిశోధకురాలు అనంతామాత్యుడినిమర్చిపోయి నాగ్గాడు, ఎంటీవోడు, కిట్టీగాడు, జ్యోతిలచ్చిమి, జైమాల్ని మీద మసాలా చదవడం మొదలు పెట్టారు. చదువుతూ చదువుతూ ఉండగా ఒక శీర్షిక ఆవిడని ఆకర్షించింది.

అది ఒక కన్నడ సినిమాకి వచ్చిన పురస్కారం గురించి - దానికి మూలం "తబ్బలియు నీనాదె మగనే" (నాయనా! అనాధవైతివా?) అనబడే నవలని, ఆ నవలకి మూలం ఆవు-పులి కధ అని అందులో వ్రాయబడి ఉంది. ఇది చదివిన వెంటనే ఆవిడ మంచం మీదనుండి ఒక్క ఎగురు ఎగిరి, (మళ్ళీ తల ఫేనుకి తగిలితే ఫేను ఎక్కడ విరిగిపోతుందోనన్న భయంతో దానిని చాకచక్యంగా తప్పించుకుని) ఒక్క ఉదుటున పెన్ను తీసి మైసూరులో ఉన్న స్నేహితురాలికి ఈ కధ గురించిన వివరాలకోసం ఉత్తరం వ్రాశారు. ఆవిడ ఇచ్చిన సమాధానం బట్టీ తెలిసినదేమిటంటే ఈ కధ కన్నడంలో కూడా ఉంది అని.

రెండు భాషల్లో ఒకే కధ ఉంది అంటే కొంపదీసి దీని మూలం సంస్కృతంలో లేదు కదా అని మన పరిశోధకురాలికి ట్యూబులైట్ వెలిగింది. వెంటనే ఆంధ్ర యూనివర్సిటీలో సంస్కృత భాషలో ప్రొఫెసర్ అయిన తన పెదనాన్నగారు వేలూరి సుబ్బారావుగారి సాయంతో పురాణాలని తిరగెయ్యడం మొదలుపెట్టారు. వెతకగా వెతకగా పద్మపురాణంలోనూ, స్కాందపురాణంలోను ఈ కధకి మూలం దొరికింది. అంటే దానిని అనంతామాత్యుడు "కస్టమైజ్" చేసి తన పరిసరాలకు పరిస్థితులకు అనుకూలంగా అద్భుతమైన కథ మలిచాడన్నమాట. అంటే దానర్థం ఆవు-పులి కధకు మూలం మన పురాణాలేగానీ అది అనంతామాత్యుడి కల్పితం కాదనేగా?

********** 

కాలక్రమంలో భోజరాజీయం తెలుగులో మొట్టమొదటి కల్పిత కధాకావ్యమని, ఆవు-పులి కధ అనంతామాత్యుడి కల్పితం కాదని నిరూపించినందుకు ఆవిడ థీసిస్ కి పీహెచ్ డి పట్టా, తరవాత తూమాటి దోణప్ప గోల్డ్ మెడల్ కూడా రావడం జరిగిపోయింది గాని అదంతా అప్రస్తుతం)

ఈ కధంతా నాకెలా తెలుసు అని అడగబోతున్నారా? అక్కడికే వస్తున్నా ఉండండీ! ఆ నాగార్జునా విశ్వవిద్యాలయం ఆచార్యులు బొడ్డుపల్లి పురుషోత్తం, పరిశోధకురాలి పేరు సీతాలక్ష్మి (ఆవిడ మా అమ్మ).

ఈ ఆవు-పులి కధ ఇవాళ రాయడంలోకూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆవు, పులితో "గుమ్మెడుపాలతో నా బిడ్డ సంతృప్తి పడునుగాని నా మాంసము మొత్తము భుజించిననూ నీ జఠరాగ్ని చల్లారదు. ప్రధమకార్య వినిర్గతి నీకునూ తెలియును కదా, అన్నా! వ్యాఘ్రకులభూషణా! చయ్యన పోయివచ్చెదను" అని తన దూడ దగ్గరకువచ్చి దూడతో అన్న మాటలను అనంతామాత్యుడు పద్యరూపంలో అమోఘంగా వ్యక్తీకరించిన తీరు మీరే చూడండి


            "చులుకన జలరుహ తంతువు
            చులుకన తృణకణము దూది చుల్కన సుమ్మీ
            యిల నెగయు ధూళి చుల్కన
            చులుకన మరి తల్లిలేని సుతుడు కుమారా!"


తాత్పర్యం: తామరతూడులోని దారము, గడ్డిపరక, దూది, ధూళి ఎంత చులకనో, తల్లిలేని కూడా లోకానికి అంతే చులకన కుమారా !

అలాగే సంస్కృతమూలంలో ఉన్న శ్లోకం కూడా:


            నాస్తిమాతృ సమ: కశ్చిత్ బాలానాం క్షీరజీవనం
            నాస్తిమాతృ సమోనాధ: నాస్తిమాతృ సమాగతి:


హృదయాన్ని కరిగించే ఈ మాటలు తల్లిప్రేమను ఎంత అందంగా వర్ణిస్తాయో కదా! "మదర్స్ డే" సందర్భంగా మనం గుర్తుచేసుకోవాల్సిన కధలలో మొదటిది ఇదే!

 


 

From Editor:

పుణ్యకోటి గోవు కన్నడ గీతం - గానం, పి.బి. శ్రీనివాస్

చిత్రం: తబ్బలియు నీనాదె మగనే (కన్నడ)

 

 

 

 

 

Comments   

 
-1 #3 Mr Bhaskara Subrahmanya 2014-01-29 17:25
Very nice I am searching for this information from long time.
Where can I get full text of "Go Vyaghra Samvadamu"
Please let me know
Quote
 
 
0 #2 RE: ఆవు-పులి కధ RAHUL 2012-12-18 09:39
Sir,
When opening this site, it shows infected.
plz rectify it as early as possible
Quote
 
 
0 #1 RE: ఆవు-పులి కధ Satishkumar 2011-02-23 17:52
Informative article. Thanks for sharing.
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh