The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 3
PoorBest 

సమాఖ్య పద్ధతికి కాంగ్రెస్ తూట్లు పెట్టిందని అందుకని ప్రణాళికా సంఘం స్థానంలో మరో సంస్థ అవసరమని చెప్పి, జనవరి, 2015లో నీతీ ఆయోగ్‌ని మొదలుపెట్టాడు నరేంద్ర మోడి. అన్ని రాష్ట్రాలకు సమాన ప్రతిపత్తి అని మొదలు పెట్టిన ఈ వ్యవస్థ, ఆదిలోనే సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఆంధ్రాకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వకూడదని చెప్పింది. దానికి కారణాలు ఏమిటంటే, మరో తొమ్మిది రాష్ట్రాలు కూడా ప్రత్యేక ప్రతిపత్తి అడుగుతున్నాయి కాబట్టి ఇవ్వటం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఇవ్వాలని అనుకున్నా, నీతీ ఆయోగ్ కారణంగా ఇవ్వలేకపోతున్నట్లు వెంకయ్య 19-సెప్టెంబరు-2016లో హిందు వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదటిసారి చెప్పాడు. ఈ నిర్ణయం 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల కనుగుణంగానే ఉంది కాబట్టి ఏమీ చేయలేకపోతున్నామని చెప్పాడు ఈ పెద్దమనిషి.

 

26-మే-2014లో ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసాడు. దాదాపు ఏడు నెలల తర్వాత, 1-జనవరి-2015న నీతీ ఆయోగ్ ఏర్పాటు చేసాడు. ఆ తర్వాత దాదాపు 21 నెలలకు ప్రత్యేక ప్రతిపత్తి సాధ్యం కాదనే విషయం ప్రజలకు చెప్పాడు వెంకయ్య. ఎవరు ఎవరిని మోసం చేస్తున్నట్లు? అధికారంలో ఉన్న మొదటి ఏడు నెలలలో ప్రణాళికా సంఘం ద్వారా ప్రత్యేక ప్రతిపత్తి ఎందుకు ఇవ్వలేదు. ఆ తర్వాత, 21 నెలల పాటు తాత్సారం చేసి, చావు కబురు చల్లగా ఎలా చెప్పగలిగారు. ఆంధ్ర ప్రత్యేక ప్రతిపత్తి విషయం ఏ ఇతర రాష్ట్రపు డిమాండుతో పోల్చినా ప్రత్యేకమని మోడీకి తెలియదా? చాలా ప్రత్యేక పరిస్థితుల్లో రాజధానిలేని రాష్ట్రంగా అవతరించింది ఆంధ్రా అన్న విషయం ఈ మనిషికి తెలియదా? పోనీ, దానికి బదులుగా ఏమిస్తారనే విషయం మీద ఇంతవరకూ మోడీ ప్రభుత్వం స్పష్టత ఎందుకు ఇవ్వటంలేదు.

 

తాను ఏర్పాటు చేయబోయే నీతీ ఆయోగ్ ద్వారా ప్రత్యేక ప్రతిపత్తి కష్టమౌతుంది, కాబట్టి ముందే అది ఇచ్చేసి, ఆ తర్వాత నీతి ఆయోగ్ మొదలేద్దామనే ఆలోచన ఆయన ఎందుకు చేయలేదు. పోనీ, నీతి ఆయోగ్ చైర్‌మన్ గా ఆంధ్రాకు ఇచ్చే తీరాలి అని ఆయన పట్టుబడితే పని కాదా?

 

పనులన్నీ ఆపుకొని మన్ కీ బాత్ పేరుతో ప్రజలకు ప్రవచనాలు చేసే ప్రధానికి, ఈ విషయాలన్నీ ఆంధ్రులకు లేదంటే కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించాల్సిన బాధ్యత ఉన్నదని ఎందుకు అనిపించలేదు.? అన్ని రాష్ట్రాలకు సమాన ప్రతిపత్తి, సమైఖ్య స్ఫూర్తి బొంగు భోషాణం అని ఉపన్యాసాలు దంచిన దుర్గ్మార్గుడు, చెంబుడు నీళ్ళతో ఆంధ్రుల ఆశలపై నీళ్ళు చల్లి, గుప్పెడు మట్టి మొహాన పూసి వెళ్ళిన ఈ పెద్దమనిషి, ఈరోజు ఏ మొహం పెట్టుకొని ప్రధానిగా కొనసాగుతున్నాడు? సిగ్గెగ్గులు లేని ఈ ప్రధానికి, ఈ పార్టీకీ మద్దతు ఎందుకు ఉపసంహరించ కూడదు?

 

మోడీ భక్తజనసందోహం, మహాత్ముడు మోడీ మన రాష్ట్రానికి పంపు సెట్లు ఇచ్చాడని, ఎల్.ఇ.డి. బల్బులిచ్చాడని, స్మార్ట్ సిటీలిస్తున్నాడని, రెండు పట్టాలేసాడని, మూడు చెరువులు తవ్వించాడని ఇవన్నీ కేంద్రం ఇచ్చిన నిధులతో చేయించి, తన పథకాలని చంద్రబాబు చెప్పుకుంటున్నాడని గోల చేస్తున్నారు. అయ్యా, ఈ చెంబులు చాంతాళ్ళు ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఇస్తున్నారా? మరే రాష్ట్రానికి ఇవి ఇవ్వటంలేదా అని అడిగితే ఒక్క సమాధానం లేదు. భాజపా పాలిత రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల వివరాలు సేకరిస్తే కానీ, ఇతర రాష్ట్రాలకు ఈ దుర్మార్గుడు చేసిన ద్రోహం మనకు పూర్తిగా తెలియదు.

 

ఇంకా, చంద్రబాబు నిధులు వేరే పథకాలకు తరలిస్తున్నాడని, కాగ్ నివేదికలు అవే చెబుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో మోడీ ఏం చేయగలడని కూడా ఈ భక్తజనసందోహం ఆక్రోశం వెలిబుస్తున్నాయి. అయ్యా, దాదాపు 15 వేల కోట్ల నిధులు తరలించిందని కొన్నాళ్ళ క్రితం అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ మీద కూడా వర్తాలు వచ్చాయి. గత పది సంవత్సరాలలో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మీద కూడా ఇటువంటి ఆరోపణలు ఎన్నో వచ్చాయి. ఇక కాగ్ విషయానికి వస్తే, ఒక్క మన రాష్ట్రమే కాదు, దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల పద్దుల మీద ఇటువంటి వ్యాఖ్యలే కనిపిస్తాయి. చివరికి కేంద్ర ప్రభుత్వం మీద కూడా చాలానే వ్యాఖ్యలు చేసింది. మరి వాటి మాటేమిటి?

 

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పాల్సిన వేదిక మీద తొంభై నిముషాలు కాంగ్రెస్‌ను అన్నిరకాలుగా ఆడిపోసుకున్న మోడీ, కనీసం ఒక్క నిముషమైనా, ఆంధ్రుల అందోళనను ప్రస్తావించాడా? అస్తవ్యస్తంగా అడ్డదిడ్డంగా జరిగిన రాష్ట్ర విభజన పాపంలో భాజపా పాత్ర ఏమీలేదా? అప్పటి ప్రధాన మంత్రి అయిదు సంవత్సరాల ప్రత్యేక ప్రతిపత్తి ప్రస్తావిస్తే, కాదు కూడదు కనీసం పది సంవత్సరాలు ఇస్తేగానీ, విభజన చట్టాన్ని ఆమోదించమని మొసలి కన్నీళ్ళు పెట్టింది ఈ వెంకయ్యే కాదా? ఆ పిమ్మట వచ్చిన ఎన్నికలలో తెదేపాతో చెట్టపట్టాలేసుకుని, తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తామన్న వాగ్దానం చేసింది ఈ మేకవన్నెపులి ఈ మోడీ కాదా? విశాఖపట్నం రైల్వే జోను కచ్చితం ఏర్పాటు చేస్తామని నాలుగేళ్ళుగా మభ్యపెడుతూ, ఇప్పుడు పొరుగు రాష్ట్రాల సమస్య వల్లే కుదరటంలేదని చెబుతున్నది ఈ తేనె పూసిన కత్తి మోడీ కాదా? ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక ప్యాకేజీలు పక్కన పెట్టినా, విభజన చట్టంలో చేసిన వాగ్దానాలపై కూడా ఏ స్పందన లేకపోవటానికి కారణాలేమిటి? ఈ సవతి తల్లి ప్రేమకు కారణం ఏమిటి? ఇది నిజంగా సవతి తల్లి ప్రేమేనా, వేరే కోణం ఏదైనా ఉన్నదా? ఆలోచించాల్సిన ప్రశ్నలే ఇవన్నీ. వీటికి జవాబు కూడా ఉంది.

 

"నాగు పాము పగ పన్నెండేళ్ళు, నాలో రగిలే పగ నూరేళ్ళు". ఇది తెలుగు సినిమా పాటే కాదు, నరేంద్ర మోడీ గుజరాతీలో పాడుకునే పాట. అలానే, ఏరు దాటాక తెప్ప తగలేసే మోడీ వ్యక్తిత్వం కూడా మరో కారణం. వ్యక్తిగత విషయాలు ప్రస్తావించటం సమంజసం కాదు కాబట్టి, ఆయన తల్లిని, భార్యను ఎందుకు దూరం పెట్టాడనే విషయం మాట్లాడను.

 

మోడీ రాజకీయ సోపానానికి వెన్నుదన్నుగా నిల్చిన అద్వానీ, మురళీమనోహర్ జోషీ లాంటి భాజపా దిగ్గజ నేతలకు ఈనాడు పట్టిన దుర్గతి చూడండి. ఎప్పటికీ పి.ఎం. ఇన్ వెయిటింగ్‌లా మిగిలిపోతానేమో అని మధనపడ్డ అద్వానీని, మోడీ ప్రధాని అయిన తర్వాత భారత రాష్ట్రపతి చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ, తన ఒంటెద్దు పోకడలకి రాష్ట్రపతిగా అద్వాని ముసలి పెత్తనం తనకు ఎలాంటి సవాళ్ళు విసురుతుందో అన్న అనుమానంతో మోడీ కుదేలైపోతుంటే, సి.బి.ఐ. అద్వానీ మీద సమయానుకూలంగా మళ్ళీ కేసు తిరిగితోడటం కలిసొచ్చింది. ఇక్కడి సమయానుకూలాన్ని గమనించండి.

 

తనకన్నా ముందే, ప్రధాని పదవికి అర్హురాలని పేరొందిన సుష్మా స్వరాజ్‌కి విదేశాంగ మంత్రిగా ఆయన ఇచ్చిన బాధ్యతలు గమనించండి. కేవలం వీసాలు ఇప్పించటం, పాస్‌పోర్టులు చేయించటం తప్ప, విదేశాంగ విధానంలోని విధివిధానాల రూపకల్పనలో ఆమెకు ఏమాత్రం పాత్ర లేదు.

 

స్వంత పార్టీలోనే ప్రత్యర్ధులుగా భావించిన వారిని మట్టి కరిపిస్తున్న మోడీ, చంద్రబాబును ఎలా నిర్లక్ష్యం చేయగలడు? అందులోను, 2002లో గుజరాత్ అల్లర్ల కారణంగా అప్పటి ఎన్.డి.ఏ. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన చంద్రబాబును ఎలా క్షమిస్తాడు? పార్లమెంటులో రేణుకా చౌదరిని శూర్పణఖ గా అభివర్ణించిన మోడీ, నిజానికి భారతంలోని శిఖండి పాత్ర పోషిస్తున్నాడని గ్రహించాలి. బాబు మీది పగను, ఆంధ్రుల మీద చూపిస్తున్నాడు నరేంద్ర మోడీ. అంతేకాక, తన పార్టీ ప్రతినిధుల ద్వారా బాబు మీద బురదజల్లి ప్రజలలో ఆయన మీద వైషమ్యాన్ని పెంచి రాజకీయంగా రాష్ట్రంలో లబ్దిపొందాలని ఆశిస్తున్నాడు నరేంద్ర మోడీ. తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిల్చిన ఎన్.టి.ఆర్. పేరును పార్లమెంటులో ఉదహరించటం కూడా అంతర్లీనంగా బాబును అధిక్షేపించే ప్రయత్నమే. రేపు తెలుగుదేశం నిట్టనిలువుగా చీలినా, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అస్థిరపరచే విధంగా మతకల్లోలాలు రేగినా, దానికి బాధ్యత నరేంద్ర మోడీదే.

 

రాష్ట్ర ప్రజల మధ్య విభేధాలు సృష్టించాలని భాజపా దుర్మార్గులు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టాలి. రాష్ట్రంలో భాజపాని తరిమికొట్టాలి. ప్రత్యేక ప్రతిపత్తి మన హక్కు అని ఎలుగెత్తి చాటుదాం. మోడీకి దాసోహం అనాల్సిన అవసరం ఏమాత్రమూ మనకు లేదు. పోరాడైనా సాధించుకుందాం.

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh